ఏడిదము సత్యవతిగారి ఆత్మచరితము.
ఈ పుస్తకం మొదటిసారి 1934లో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయ ముద్రణశాలయందు క.కోదండరామయ్యగారిచే ముద్రించబడింది. ఈ పుస్తకం ముందుమాట (ఫిబ్రవరి 1, 1934) వ్రాసినప్పుడు సత్యవతిగారు అవనిగడ్డలో ఉన్నారు. స్త్రీలు తెలుగులో రాసిన ఆత్మకథల్లో ఇది మొదటిది కావచ్చు అని ఈ పుస్తకానికి విపులమైన ముందుమాట వ్రాసిన శ్రీ వకుళాభరణం రామకృష్ణ భావించారు. ఆయన పరిశోధన ప్రకారం, 1934కు ముందు తెలుగులో మూడు ఆత్మకథలు మాత్రమే ప్రచురింపబడ్డాయి: కందుకూరి వీరేశలింగము స్వీయ చరిత్రము (మొదటి సంపుటము 1911, రెండవ సంపుటము 1915), రాంభొట్ల జగన్నాధ శాస్త్రి స్వీయవరిత్రము (1916, విశాఖపట్టణము), రాయసం వెంకట శివుడు ఆత్మచరితము (1933, గుంటూరు). అందుచేత తొలి తెలుగు స్వీయచరిత్రల వరుసలోనూ, సత్యవతిగారిది ఉన్నత స్థానమే.
ఉత్తమనాయకుడికి ఉండవలసిన లక్షణములన్నియు మూర్తీభవించిన తన నాధుడు శ్రీ ఏడిదము సీతారామయ్యని ఈ పుస్తకానికి నాయకుడిగా చేసుకొన్నాను అని ముందుమాటలో సత్యవతిగారు అన్నారు. ఈ పుస్తకానికి ముందు “సీతారామాస్తమయ”మని పేరు పెడదామనుకొన్నారు కాని, “వారి అర్థ శరీరిణినైన నేనును ఆ కష్టముల ననుభవించినదాని నగుట చేతను, ఇప్పటికిని మా ఆఆఖ్యాయికకు, శాంతి జరుగక రంగమధ్యమునందే యుండుట చేతను, దీనికి ఆత్మచరితము అని పేరు బెట్టితిని”.