ROADMAP TO TELUGU BHASHA
తెలుగు విశిష్ట భాషా కేంద్రానికి దారిపటం
తెలుగు విశిష్ట భాషా కేంద్రం దిశనూ, దశనూ నిర్ధారించే కీలక సమావేశం హైదరాబాద్‌లో గురువారం తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా విశిష్ట్భాషా కేంద్రానికి దారిపటం ఖరారు చేశారు. పండితులు, సంపాదకులు పాల్గొన్న ఈ సమావేశంలో భారతీయ భాషల కేంద్ర సంస్థ ప్రతినిధి విజయసారథి మాట్లాడుతూ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. రానున్న 20 ఏళ్లకు విస్తృత ప్రణాళిక రూపొందిస్తున్నామని, అందులో భాగంగా సమగ్ర గతి శీలక నిఘంటువు రూపొందిస్తామని వెల్లడించారు. గత డిసెంబర్‌లో ఎస్వీయులో జాతీయ సదస్సు నిర్వహించామని, ఏప్రిల్ 29 నుండి మేధోమథనం సదస్సు, గత నెల ప్రాచీన తెలుగు శాసనాలపై సదస్సు నిర్వహించామని వెల్లడించారు. నవంబర్ 20 నుండి జరిగిన సదస్సులో తెలుగుభాషకు వెబ్‌సైట్ నిర్ధారణ అయిందని అన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో తెలుగు శాఖాధ్యక్షుల సదస్సును, 28 నుండి మూడు రోజుల పాటు నాణాలు-రాతప్రతుల సమావేశం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. నేషనల్ ట్రాన్స్‌లేషన్ మిషన్ ఆధీనంలో తెలుగు పదబంధాల సేకరణ జరుపుతామని, ‘శబ్దసాగర రత్నాకరం’ పేరుతో బృహన్నిఘంటువు రూపొందిస్తామని వెల్లడించారు.